
స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అన ర్హుడు
మాజీ ఎమ్మెల్యే గణేష్
నర్సీపట్నం: స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని, క్వాలిటీస్ గురించి మాట్లాడే అర్హత అయ్యన్నపాత్రుడికి లేదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం సరికాదని, అదే స్థాయిలో తామూ విమర్శలు చేయాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 17 నెలల కాలంలో రూ.83 వేల కోట్లు అప్పు చేస్తే, కూటమి ప్రభుత్వం 17 నెలల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించి సీఎం ఎవరైనా ఉన్నారంటే అదే చంద్రబాబే అన్న విషయాన్ని స్పీకర్ గ్రహించాలన్నారు. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడుకు ఏవిధమైన క్వాలిటీస్ ఉన్నాయని గణేష్ ప్రశ్నించారు. నడిరోడ్డుపై మున్సిపల్ కమిషనర్, డీఈ ని, రావికమతం మండలంలో పోలీసులను, అన్‌రాక్ లారీల డ్రైవర్లను బూతులు తిట్టడమేనా స్పీకర్ క్వాలిటీస్ అని ఎద్దేవా చేశారు. నోరు విప్పితే బూతులు మాట్లాడే అయ్యన్నపాత్రుడు క్వాలిటీస్ గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన వారిని అరెస్టు చేయాలని స్పీకర్ ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ బూతులు తిడితే అరెస్టు చేయరా అని గణేష్ పోలీసులను ప్రశ్నించారు. స్పీకర్ బూతులు తిట్టవచ్చని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై జీవో లేదని ప్రజలను నమ్మించేందుకు స్పీకర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మెడికల్ కాలేజీపై స్పీకర్‌కు అవగాహన లేదని చెప్పారు. చేతనైతే మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం కాకుండా చూడాలన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, వైద్య విద్యతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో నర్సీపట్నం ఒకటని తెలిపారు. రూ.500 కోట్లతో 600 పడకలతో నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. పీపీపీ విధానంలో ఈ కాలేజీని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం 28 రోజుల క్రితం ప్రత్యేక జీవో ఇచ్చిన విషయం స్పీకర్‌కు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022 ఆగస్టు 8న జీవోను జారీ చేసిందన్నారు. కాలేజీని ప్రైవేటు పరం చేసి, ఈ ప్రాంత పేద ప్రజలను దోపిడీ చేసేందుకు స్పీకర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుడు ప్రచారం మానుకుని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని గణేష్ హితువు పలికారు. ఈ సమావేశంలో మాకవరపాలెం మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ మాకవరం పాలెం మండల అధ్యక్షుడు చిటికెల రమణ, పార్టీ నాయకులు రుత్తల శ్రీనివాస్, బొడ్డు గోవిందరావు పాల్గొన్నారు.