
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభోత్సవంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గొలుగొండ: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, అప్పుడే మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. గొలుగొండ మండలం ఏఎల్‌పురం(కృష్ణదేవిపేట) హైస్కూల్లో రాష్ట్ర స్థాయి జూనియర్ 12వ సాఫ్ట్‌బాల్ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. ముందుగా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలను వచ్చిన జట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ అండర్–14 విభాగం పోటీల్లో 416 మంది బాలబాలికలు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు నడియాడిన ఈ ప్రాంతంలో ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామన్నారు. ప్రస్తుతం క్రీడలపై చిన్నచూపు ఉందని, ఇకనుంచి పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి తనవంతు సాయంగా రూ.50 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏఎస్పీ దేవిప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు, నిర్వాహకులు రమణ, శ్రీనివాసరావు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, సర్పంచ్ లోచల సుజాత పాల్గొన్నారు.