యలమంచిలి రూరల్: సంపూర్ణ మద్యనిషేధం కోసం పరితపించిన గాంధీ జయంతి రోజున ప్రతి ఏటా మద్యం విక్రయాలను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈసారి గాంధీ జయంతి దసరా రోజున రావడంతో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు పేరుకే మూతపడ్డాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం అనుమతి ఉన్న మద్యం దుకాణాల నుంచి అనుబంధంగా ఉన్న బెల్టు షాపులకు కావాల్సినన్ని మద్యం కేసులను తరలించి నిల్వ చేశారు. ఆ తర్వాత బెల్టు దుకాణాల ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. బుధవారం మద్యం దుకాణాలు మూతపడిన సమయం నుంచి గురువారం రోజంతా, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు నిరాటంకంగా బ్లాక్‌లో అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేపట్టారు. ఇదంతా తమ కళ్లముందే జరుగుతున్నా అబ్కారీ, పోలీసు శాఖల అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో లిక్కర్ దందా మూడు సీసాలు.. ఆరు గ్లాసులుగా కొనసాగింది. కూటమి నేతలు, బెల్టు షాపుల నిర్వాహకులు, యంత్రాంగం మూకుమ్మడిగా గాంధీ జయంతి రోజున మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. బహిరంగంగా మద్యం విక్రయాలను చేపట్టారు.
బాటిల్‌కు రూ.50 నుంచి
రూ.100 వరకు వసూలు
గాంధీజయంతి సందర్భంగా అధికారికంగా మద్యం దుకాణాలు, బార్లు మూ సివేయడంతో దీన్ని ఆసరాగా చేసుకున్న బెల్టు షాపుల నిర్వాహకులు ధరలు పెంచి అమ్ముకున్నారు. ఒక బీర్‌కు రూ.50 నుంచి రూ.100, లిక్కర్ విషయానికొస్తే ఒక క్వార్టర్ బాటిల్‌కు రూ.50 నుంచి రూ.70 వరకు, ఒక హాఫ్‌నకు రూ.100, ఫుల్ బాటిల్‌పై రూ.200 వరకు అమ్మారు. కొన్ని చోట్ల మద్యం ప్రియుల అవసరం, డిమాండ్‌ను బట్టి ధర మరింత పెంచి అమ్ముకున్నట్టు తెలిసింది. బెల్టు షాపుల నిర్వాహకులు రెండ్రోజుల్లో బాగా లాభపడినట్టు తెలుస్తోంది.
ఇబ్బడిముబ్బడిగా బెల్టుషాపులు
బెల్టు షాపుల బెండు తీసేవారే కరువయ్యారు. పర్మిట్ రూముల వైపు అసలు చూడడమేలేదు. జిల్లావ్యాప్తంగా 158 మద్యం షాపులు, 10కి పైగా బార్లు ఉన్నాయి. బెల్టు షాపుల సంఖ్య రెండు వేలకు పైమాటే. వీటిలో ఎక్కువ మద్యం షాపులు కూటమి నేతలు, వారి అనుచరులవే కావడంతో నిబంధనలు గాలికిపోయాయి. ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతోంది. దీంతో జిల్లా మద్యం మత్తులో జోగుతోంది. గ్రామానికి కనీసం రెండు, కొన్ని చోట్ల నాలుగైదు, పట్టణాల్లో పదుల సంఖ్యలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బహిరంగంగా వేలం పాటలు నిర్వహించి మరీ బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు అప్పుడప్పుడు నామమాత్రంగా తనిఖీ లు చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. యలమంచిలి పట్టణం, మండలంలో బెల్టుషాపుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆర్టీ సీ కాంప్లెక్స్ సమీపంలో, సైతారుపేట రోడ్డు, దిమిలిరోడ్డు పెంకుల ఫ్యాక్టరీ ఏరియా, రాంనగర్, ధ ర్మవరం సహా పలు ప్రాంతాల్లో కొన్నిచోట్ల బడ్డీ కొ ట్లు, కిరాణా షాపులు, కూరగాయల దుకాణాల ముసుగులో బెల్టు షాపులు నిర్వహిస్తూ మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పులపర్తిలో హైవే కూడలిలోనే రెండు బెల్టు షాపులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో నిత్యం వాహనాల డ్రైవర్లు, సమీపంలో యువకు లు మద్యం కొనుగోలు చేస్తున్నారు. గురువారం గాంధీజయంతి రోజున పట్టణంలో బెల్టుషాపుల వద్ద మద్యం విక్రయాలు జరిగాయి. గురువారం జిల్లాలో 7 కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి వి.సుధీర్ తెలిపారు.
గాంధీ జయంతి నాడు యథేచ్ఛగా
మద్యం విక్రయాలు
జిల్లావ్యాప్తంగా బెల్టు షాపులు,
ప్రైవేటు వ్యక్తుల అమ్మకాలు
బ్లాక్‌లో బాటిల్‌పై రూ.50 నుంచి రూ.100 వరకు బాదుడు
లిక్కర్ దందాను చోద్యం చూసిన
ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు
క్షమించు మహాత్మా..!