
ప్రై‘వేటు’ వేయడమే చంద్రబాబు విధానం
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం
● ఐదు పూర్తయ్యాయి.. మిగిలినవి చివరి దశలో ఉన్నాయి
● వాటిని ప్రైవేటుపరం చేయడమే నారా వారి లక్ష్యం
● కూటమి కుటిల యత్నాలను అడ్డుకుంటాం
● 9న అనకాపల్లి జిల్లాకు మాజీ సీఎం వైఎస్ జగన్
● మాకవరపాలెం మెడికల్ కాలేజీ సందర్శన
● వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు వెల్లడి
● ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు అమర్‌నాథ్,
ముత్యాలనాయుడులతో కలిసి స్థల పరిశీలన
సాక్షి, అనకాపల్లి/మాకవరపాలెం: ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడమే నారా వారి పాలనంటూ వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలు పూర్తికాగా.. మిగిలినవి సగానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నిర్మాణాలను కొనసాగించకపోగా.. వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు అన్ని కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈనెల 9న మాకవరపాలెం మండలంలో గల భీమబోయినపాలెంలో మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వం మెడికల్ కళాశాలను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారన్నారు.
పర్యటించే ప్రాంతాల పరిశీలన
మాజీ సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కురసాల కన్నబాబుతోపాటు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల పార్టీ అధ్యక్షులు అమర్‌నాథ్, కేకే రాజు, మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఉన్నారు. అనంతరం అనకాపల్లి వెళ్లి అక్కడి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రై‘వేటు’ వేయడమే చంద్రబాబు విధానం