
గాంధీ మార్గం అనుసరణీయం
తుమ్మపాల: అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని, ఆయన మార్గం అనుసరణీయమని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. గాంధీ జయంతి, దేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా గాంధీ కలలు కన్నారని, ఆయన ఆశయాలను నిజం చేయాలన్నారు. లాల్ బహదూర్‌శాస్త్రి రైతులకు అందించిన సేవలను కొనియాడారు. డీఆర్వో వై.త్యనారాయణరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా
ధాన్యం సేకరణ
ఖరీఫ్ 2025–26లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి ధాన్యం సేకరణ సమన్వయ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవితో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్‌లో ధాన్యం తేమ శాతాన్ని అనుసరించి క్వింటాకు సాధారణ ధర రూ.2,369, గ్రేడ్ ఏ రకం రూ.2,389 చొప్పున ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ముందే గ్రామ స్థాయిలో ఈ–పంట, ఈ–కేవైసీ నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 63 క్లస్టర్ రైతు సేవ కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి
అనకాపల్లి: విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని కల్టెకర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జేసీ జాహ్నవి, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి పోలీసు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, మత్స్యశాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీరప్రాంత మండల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్