
యూరియా కోసం పడిగాపులు
● వేకువజాము నుంచే
నిరీక్షించినా దక్కని ఫలితం
● కొద్ది సేపటికే సరకు పూర్తవడంతో
అన్నదాతలకు నిరాశ
కె.కోటపాడు: వేకువజాము నుంచే వేచి ఉన్నా యూరియా లభించకపోవడంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. చౌడువాడ గ్రామంలో గల రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం యూరియా పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో వేకువజామునే రైతు సేవా కేంద్రం వద్దకు రైతులు చేరుకున్నారు. రైతు సేవా కేంద్రం వద్ద రైతుల పాస్ పుస్తకాలు జెరాక్స్‌లతోపాటు ఆధార్‌కార్డులను లైన్‌లో ఉంచి వ్యవసాయశాఖ అధికారులు వచ్చేంత వరకూ వేచి ఉన్నారు. తీరా రైతు సేవా కేంద్రానికి వచ్చిన 12 టన్నుల యూరియా కోసం సుమారు 600 మంది రైతులు పోటీ పడ్డారు. తీరా ప్రారంభించిన కొద్ది సేపటికే సరకు పూర్తయ్యింది. దీంతో యూరియా దక్కని రైతులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్ధితి ఏర్పడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పీఏసీఎస్‌ల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇచ్చేవారని రైతులు గుర్తు చేసుకున్నారు. చౌడువాడ రెండు సచివాలయాల పరిధిలో గల చౌడువాడ, గరుగుబిల్లి, మల్లంపాలెం, పాచిలవానిపాలెం గ్రామాల్లో పంటల సాగును వ్యవసాయశాఖ అధికారులు పరిగణనలోనికి తీసుకొని త్వరితగతిన యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.