
రౌడీయిజం చేస్తే ఉపేక్షించం
● అనకాపల్లి డీఎస్పీ శ్రావణి హెచ్చరిక
● దేవరాపల్లిలో రెండు వర్గాల
మధ్య కొట్లాటపై విచారణ
● 10 మందిపై కేసులు నమోదు
దేవరాపల్లి: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అల్లర్లు సృష్టించాలని చూస్తే రౌడీషీట్లు తెరుస్తామని అనకాపల్లి డిఎస్పీ ఎం. శ్రావణి హెచ్చరించారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేయాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దేవరాపల్లిలో గురువారం రాత్రి వాట్సాప్ చాటింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసింది. పోలీసులు సకాలంలో స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టి వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమణిగించారు. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం. శ్రావణి శుక్రవారం దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఇరువర్గాల వారిని స్టేషన్‌కు పిలిపించి ఘర్షణకు దారి తీసిన కారణాలపై ఆరా తీసి, వారిని గట్టిగా మందలించారు. ఒక వర్గానికి చెందిన కిలపర్తి భాస్కరరావు సహా ఐదుగురి పైన, మరో వర్గమైన వరదపురెడ్డి సింహాచలంనాయుడు సహా ఐదుగురి పై కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరువర్గాలకు చెందిన 10 మందిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయాలని ఎస్‌ఐని ఆదేశించినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఆమె వెంట ఎ.కోడూరు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తదితర్లు ఉన్నారు.