
భారీ వర్ష సూచన
తుమ్మపాల: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఆమె మండల అధికారులతో కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమెతోపాటు ఎస్పీ తుహిన్ సిన్హా, జేసీ జాహ్నవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఒకటి, రెండు గంటలలో సరిచేయాలని, రోడ్లపై చెట్లు పడిపోతే వాటిని వెంటనే తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని చెప్పారు. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ, సాగునీటి పారుదల శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జలాశయాలలో పూర్తిస్థాయి నిల్వ సామర్ధ్యం పాటించాలని, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జలాశయాలు, చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా రక్షణ కల్పించవలసిన బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులదేనన్నారు.
నిమజ్జనాల్లో జాగ్రత్త
దసరా ఉత్సవాలు పూర్తికానున్న నేపథ్యంలో అమ్మవారి విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా, ఎటువంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తీరప్రాంత మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గజ ఈతగాళ్లను నియమించాలని, బోట్లను సిద్ధం చేసుకోవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా యంత్రాంగం
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్