
వైద్యుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
● డీఎంహెచ్‌వో డా.హైమావతి
కశింకోట: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయంగా వైద్యులను నియమించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.హైమావతి తెలిపారు. కశింకోట పీహెచ్‌సీని బుధవారం ఆమె సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కశింకోట పీహెచ్‌సీలో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు మానసను తాత్కాలికంగా నియమించామని, ప్రజలు ఇబ్బంది పడకుండా వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధులతో సమావేశమై ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి వయో వందన కార్డును 70 ఏళ్లు నిండినవారు పొందాలన్నారు.
ఎన్టీఆర్ ఆస్పత్రికి అత్యవసర కేసులు
అనకాపల్లి: పీహెచ్‌సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో అత్యవసర కేసులను ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించాలని జిల్లా యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ (స్టేటస్టికల్) అధికారి రామచంద్రరావు వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన బుధవారం తరగంపూడి పీహెచ్‌సీని సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.