
నేడు అప్పన్న జమ్మివేట
సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జమ్మివేట ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూలతోటలో జరిగే ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి మధ్యాహ్నం 3.30 గంటలకు సింహగిరి నుంచి కొండదిగువకు మెట్లమార్గంలో తీసుకెళ్తారు. కొండదిగువ పూలతోటలో ఉన్న మండపంలో స్వామిని వేంజేయించి విశేషంగా పూజ లు నిర్వహిస్తారు. పూలతోటలోనే ఉన్న జమ్మిచెట్టు వద్ద శమీపూజ నిర్వహిస్తారు. తదుపరి, స్వామికి అడవివరం గ్రామ పురవీధుల్లో అశ్వవాహనంపై తిరువీధి నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. గోపాలపట్నం పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. జమ్మివేట ఉత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల వరకు సింహగిరిపై స్వామివారి మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు పూలతోటను పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు.
శమీ పూజ అనంతరం
అశ్వవాహనంపై తిరువీధి

నేడు అప్పన్న జమ్మివేట