
మెడికల్ షాపుల్లో తనిఖీలు
మహారాణిపేట: జీఎస్టీ తగ్గింపు ధరలను మెడికల్ షాపులు ఎక్కడా అమలు చేయకపోవడంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయకుమార్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మెడికల్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. మహారాణిపేట, మధురవాడ, ఎంవీపీ కాలనీ, ఆరిలోవ, గాజువాక, చిన్నగంట్యాడ, కుర్మన్నపాలెం, అనకాపల్లి, కశింకోట వంటి ప్రాంతాల్లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు దాడులు చేశారు. మొత్తం 43 మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టారు. సాక్షిలో కథనం రాగానే కొన్ని షాపులు జీఎస్టీ తగ్గింపు ధరలను తెలియజేసే సైన్ బోర్డులను ప్రదర్శించాయి. అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ స్వయంగా పెదవాల్తేరు, చిన్నవాల్తేరు ఏరియాల్లోని 11 షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ షాపుల్లో ఎక్కడా జీఎస్టీ ధరల బోర్డులు ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించారు. తక్షణమే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డ్రగ్గిస్టులను ఆదేశించారు. జీఎస్టీ నిబంధనలతో మాత్రమే మందులను విక్రయించాలని మెడికల్ షాపుల యజమానులను ఆదేశించారు. మందులను కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా జీఎస్టీ సైన్ బోర్డులు లేకపోయినా, జీఎస్టీ తగ్గింపు ధరలకు అమ్మకాలు జరగకపోయినా డీఆర్‌సీ నంబర్ 863233 0909కు గాని, లేదా dca-grams@ap.gov.inకు ఫిర్యాదు చేయాలని కోరారు.