
ఆస్పత్రి భవనం ప్రారంభం సరే.. వసతులేవి?
మాడుగుల: వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించిన మాడుగుల సీహెచ్‌సీ భవనాన్ని మౌలిక వసతులు కల్పించకుండా ప్రారంభించడంపై మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తప్పుబట్టారు. ఈ మేరకు బుధవారం స్థానిక 30 పడకల నూతన ఆస్పత్రి భవనంలోని వార్డులతో పాటు ఆపరేషన్ ఘియేటర్‌ను ఆయన సందర్శించారు. అనంతరం బూడి విలేకరులతో మాట్లాడుతూ సీహెచ్‌సీ భవనం పనులు దాదాపు 90 శాతం 2024లో ఎన్నికల ముందే పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం కూటమి ప్రజాప్రతినిధులు ఆస్పత్రి భవనం ప్రారంభించడమే కాదని, దానిలో మౌలిక వసతుల కల్పనతో పాటు డిప్యూటేషన్‌పై వెళ్లిన వైద్యులను తిరిగి తీసుకువచ్చి నిరుపేద గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే ప్లాంట్‌లను పరిశీలించి మందులు, వైద్యం అందించే తీరును వైద్యాధికారి బి.చంద్రశేఖర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న కె.కోటపాడు సీహెచ్‌సీకి రూ. 5.60 కోట్లు, మాడుగుల సీహెచ్‌సీకి రూ. 5.29 కోట్లు తమ హయాంలో మంజూరు చేశామన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పాత సీహెచ్‌సీ భవనానికి కనీసం మరమ్మతులు చేపట్టలేదని విమర్శించారు. కూటమి ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ చేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. పాత ఆస్పత్రి భవనంలో మార్చురీ విభాగం ఏర్పాటు చేస్తామని వైద్యులు సూచించడం బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్ళపురెడ్డి వెంకట రాజారామ్, మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ, వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్, సర్పంచ్ ఎడ్ల కళావతి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కోఆప్సన్ మెంబరు షేక్ ఉన్నీషా, ఉప సర్పంచ్ జవ్వాది వరహాలు, తదితరులు పాల్గొన్నారు.