
విజయవాడలో రేపు వైద్యుల ఆమరణ నిరాహార దీక్ష
ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపడుతున్న పీహెచ్‌సీ వైద్యులు
అనకాపల్లి: తమ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, శుక్రవారం విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమైనట్టు ఏపీ ప్రైమరీ హెల్త్ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్తేర్ రాణీ, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ క్రీడా మైదానం వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది పీహెచ్‌సీ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ నేటి వరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వి.సునీల్‌కుమార్, వాణిజగదీశ్వరీ, వినోద్, వెంకటేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.