
దివ్యాంగుడికి బియ్యం పంపిణీ
బుచ్చెయ్యపేట: మండలంలో రాజాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు మరిశా సన్యాసినాయుడికి అధికారులు ఇంటి వద్దే రేషన్ బియ్యం అందించారు. రెండు కళ్లూ లేని సన్యాసినాయుడు, 80 ఏళ్ల వృద్ధురాలైన అతని తల్లికి రెండు నెలలుగా రేషన్ సరకులు అందడం లేదు. రేషన్ డీలర్ ఇంటికి తీసికొచ్చి రేషన్ సరకులు పంపిణీ చేయకపోవడంపై అధికార్లకు దివ్యాంగుడు సన్యాసినాయుడు సోమవారం ఫిర్యాదు చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో తహసీల్దార్ లక్ష్మి మంగళవారం వీఆర్వో అఖిల్ ద్వారా సన్యాసినాయుడికి, అతని తల్లికి రేషన్ బియ్యం, సరుకులు అందించారు. సన్యాసినాయుడు తల్లి వయస్సు రేషన్ కార్డులో తక్కువగా నమోదవడంతో ఆమె వయస్సు మార్పు చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు.