
బల్క్ డ్రగ్స్ పార్క్‌పై తగ్గేదేలే..
రద్దు చేసే వరకూ దీక్షలు కొనసాగిస్తామన్న గంగపుత్రులు
నక్కపల్లి: బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేసే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని మత్స్యకారులు ఘంటాపథంగా చెప్పారు. రాజయ్యపేటలో వీరు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 17వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు తెలిపారు. వారితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, పార్టీ మండలాధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా నాయకుడు ఎం అప్పలరాజు దీక్ష చేశారు. అనంతరం నాయకులు, మత్స్యకారులు మాట్లాడుతూ రెండు వారాలుకుపైగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పనులు అడ్డుకుంటే హోంమంత్రి స్పందించారన్నారు. ఉప్పాడలో దివీస్ కంపెనీ, రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పెడుతూ గంగపుత్రులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ప్రాణాలకు హానీ కలిగించే కంపెనీ కాకినాడ జిల్లాలో అడ్డుకుంటే, రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన అనిత బల్క్ డ్రగ్స్ పార్క్‌ను వ్యతిరేకిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక కంపెనీలకు అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సోమవారం గ్రామంలో చర్చలు కోసం వచ్చిన అనితకు తమ వైఖరి స్పష్టం చేశామన్నారు. కమిటీ ఏర్పాటు చేస్తాం, సీఎంతో మాట్లాడుతామంటే కుదరదన్నారు. బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలని ప్రకటన చేసే వరకు దీక్ష ఆగదన్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గంగపుత్రుల సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. కూటమి నాయకులుకు మత్స్యకారుల ఓట్లు కావాలని, ప్రాణాలు అక్కర్లేదా అని మండిపడ్డారు. మండలంలో ఎక్కడా లేనివిధంగా రాజయ్యపేటలో టీడీపీకి రెండు వేల మెజారిటీ ఇస్తే, తమ గ్రామస్తుల ప్రాణాలకే ముప్పు తెచ్చే కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. తమ డిమాండ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే వరకు పనులు ఆపిస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇసుక లారీలు రావడంతో ఆగ్రహం చెందిన ఆందోళన కారులు వాటిని అడ్డుకున్నారన్నారు. మత్స్యకారులు దీక్షను మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కంబాల జోగులును కోరగా సానుకూలంగా స్పందించారు. మత్స్యకారుల దీక్షపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక ప్రకటన చేయాలని జోగులు కోరారు. వైఎస్సార్ సీపీ నాయకులు ధనిశెట్టి బాబూరావు, దగ్గుపల్లి సాయిబాబా, జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, సూరకాసులు గోవిందు, పన్నీరు బాబ్జి, గొర్ల గోవిందు, ఎం.అప్పలరాజు, ఎరిపల్లి నగేష్, ముసలయ్య, మహేష్, పిక్కి తాతీలు, గెడ్డమూరి శ్రీను, సోమేష్, నూకరాజు, అప్పలరాజు పైడితల్లి, బాబూరావు, పాల్గొన్నారు.