
7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
అనకాపల్లి టౌన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వచ్చేనెల 7న విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహించనున్నట్టు ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు చందోలు వెంకటేశ్వరులు తెలిపారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన ఎఫ్‌ఏపీటీవో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించాలని, మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు చేయాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఆర్థిక బకాయిల చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా తమ సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూనే రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంఽధించిన ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేదన్నారు. ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన రూ. 30వేల కోట్ల బకాయిల రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకూ స్పందన లేదన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించవలసిన గ్రాట్యూటీ తదితరాలను కూడా చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని చెప్పారు. ప్లస్ టు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ఫ్యాప్టో చైర్మన్ బోయిన చిన్నారావు మాట్లాడుతూ కారుణ్య నియామకాల్లో జాప్యం వల్ల మరణించిన ఉద్యోగుల వారసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పదించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యా రంగ, ఆర్థిక సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరారు. అనంతరం పోరుబాట ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కో చైర్మన్ ఆళ్ళ శేఖర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్.దుర్గాప్రసాద్, కార్యవర్గ సభ్యులు ఎ.వి.హెచ్. శాస్త్రి, మట్ట శ్రీనివాసరావు, జె.రాజేష్, వై.శ్రీనివాసారావు తదితరులు పాల్గొన్నారు.