
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
సుమారు 17.5 తులాల బంగారం వస్తువుల అపహరణ
మర్రిపాలెం/గాజువాక: నగరంలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కంచరపాలెం, గాజువాక పరిధిలో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం రాత్రి మహిళల మెడలో నుంచి సుమారు 17.5 తులాల బంగారం వస్తువులను అపహరించారు. బాధితులు క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైక్‌పై జ్ఞానాపురం, కంచరపాలెం రైతుబజారు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బిర్లా జంక్షన్ వంటి ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి బైక్ నడుపగా, వెనుక కూర్చున్న వ్యక్తి మాస్క్ ధరించి మహిళలను అడ్రస్ అడుగుతున్నట్టు నటిస్తూ వారి మెడలోని గొలుసులను లాక్కొని పారిపోయారు. జ్ఞానాపురంలో ఎం. అనంతలక్ష్మి మెడలో 3 తులాల గొలుసు, రామ్మూర్తి పంతులుపేటకు చెందిన విజయలక్ష్మి మెడలో 4.5 తులాల గొలుసు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద సంతోషి మెడలో 22 గ్రాముల గొలుసు, బిర్లా జంక్షన్ వద్ద స్రవంతి మెడలో 3 తులాల గొలుసు దొంగతనం చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను వెంబడించగా, వారు బిర్లా జంక్షన్ దాటిన తర్వాత బైక్‌ను వదిలి పారిపోయారు. నిందితులు ఉపయోగించిన బైక్ గతంలో మహారాణిపేటలో చోరీకి గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. క్రైమ్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, కంచరపాలెం క్రైమ్ ఎస్‌ఐ అబ్దుల్ మారూఫ్ ఘటన జరిగిన ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. కంచరపాలెం క్రైమ్ సీఐ చంద్రమౌళి నేతృత్వంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాజువాకలోని షీలానగర్‌లో బుధవారం రాత్రి రెండు వేర్వేరు చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. రెండు దొంగతనాల్లో మొత్తం 4.5 తులాల బంగారం అపహరణకు గురైంది. షీలానగర్‌కు చెందిన లక్ష్మీ ప్రియ.. డీమార్ట్ నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా, ఇద్దరు బైక్‌పై వచ్చిన యువకులు ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద లక్ష్మి తన అత్తతో కిలిసి వెళ్తుండగా అదే తరహాలో బైక్‌పై వచ్చిన యువకులు ఆమె మెడలోని 2.5 తులాల పుస్తెల తాడును తెంపుకొని వెళ్లిపోయారు.గాజువాక క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.