
నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత
మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ
చేయవద్దంటూ శాంతియువతంగా
నిరసనకు సిద్ధపడిన మాజీ ఎమ్మెల్యే
పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను, వైఎస్సార్‌సీపీ
శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ కార్యక్రమానికి మండలాల నుంచి
నాయకులు హాజరుకాకుండా ఎక్కడికక్కడ
హౌస్ అరెస్టులు చేశారు. గణేష్‌ను అరెస్టు
చేసి, ఎక్కడికి తీసుకెళుతున్నారో
చెప్పకుండా రెండు గంటల పాటు కారులో
తిప్పారు. దీంతో నర్సీపట్నంలో తీవ్ర
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షి, అనకాపల్లి/ నర్సీపట్నం: భీమబోయిన పాలెం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీపీపీ విధానం వద్దంటూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గురువారం నర్సీపట్నంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గణేష్ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు మున్సిపాల్ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్దకు తరలివచ్చారు. సీబీఎం కాపౌండ్ నుంచి అబిద్‌సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి, ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. అయితే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను గృహ నిర్బంధం చేశారు. పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల వద్ద అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. నిరసన కార్యక్రమానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేష్‌ను అడ్డుకోవడంతో ఆయన కారు దిగి అక్కడే ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో గణేష్‌కు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల నిరంకుశ వైఖరి నశించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గణేష్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి మాకవరపాలెం తరలించారు. మిగిలిన వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. సాయంత్రానికి వీరందరినీ విడుదల చేశారు. ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రైవేటీకరణపై పోరాటం ఆగదని ఈ సందర్భంగా గణేష్ హెచ్చరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసులను ప్రయోగించి మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ విధానం అంటే మెడికల్ కాలేజీలను అమ్మేయడమేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వబోమన్నారు. అరెస్ట్‌లకు భయపడే ప్రసక్తిలేదని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, విద్యార్థి విభాగం నాయకులు కిల్లాడ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, వీరమాచినేని జగదీశ్వరి, పెట్ల అప్పలనాయుడు, ఎంపీపీ సర్వేశ్వరరావు, మాజీ ఎంపీపీ సత్యనారాయణ, నర్సీపట్నం మున్సిపల్ చైరపర్సన్ సుబ్బలక్ష్మి, నియోజకవర్గంలో అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు.
నాయకుల హౌస్ అరెస్టు
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నర్సీపట్నంలో నిర్వహించతలపెట్టిన శాంతియుత ర్యాలీకి నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం రూరల్ గ్రామాల నుంచి బయలుదేరిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మరికొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. గొలుగుండ మండలంలో పలు గ్రామాల నుంచి వెళుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలు, బైక్‌లపై నర్సీపట్నం వెళుతున్న పార్టీ శ్రేణులను ఎస్‌ఐ రామారావు ఆధ్వర్యంలో అయ్యన్నపాలెం వద్ద నిలిపివేశారు. మాకవరపాలెం మండలంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చిటికెల రమణతో పాటు పలువురు నేతలను ముందస్తుగా మాకవరపాలెం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నాతవరం మండలం నుంచి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నాయుకులు, సర్పంచ్‌ల, ఎంపీటీసీలు, కార్యకర్తలను, నర్సీపట్నం–తుని మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డులో తాండవ జంక్షన్, డి.యర్రవరం జంక్షన్‌లో నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు అడ్డుకున్నారు. విధంగా గ్రామాల్లో కూడా పోలీసు లు వెళ్లి పార్టీ నాయకులు ర్యాలీకి వెళ్లకుండా నిలుపుదల చేశారు. నాతవరం మండలానికి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపట్టిన వైఎస్సార్‌సీపీ
అడ్డుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే గణేష్ అరెస్ట్ రెండు గంటల పాటు కారులో తిప్పిన వైనం ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు ఉదయం నుంచే పలువురు వైఎస్సార్‌సీపీ నాయకుల హౌస్ అరెస్టు
ఎన్నికేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు: మాజీ ఎమ్మెల్యే గణేష్
మాకవరపాలెంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ విలేకరులతో మాట్లాడారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామన్నారు. కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తలపెడితే.. అక్రమ అరెస్ట్‌లతో అడ్డుకున్నారని, పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరించి, హౌస్ అరెస్ట్‌లు చేయడం దుర్మార్గమని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారిపోయారని, తనను అక్రమంగా అరెస్ట్ చేసి జిల్లాలో ఉన్న పలు పోలీస్‌స్టేషన్‌లకు తిప్పి, చివరిగా మాకవరపాలెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విడుదల చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు భీమబోయినపాలెం వద్ద మెడికల్ కళాశాలను మంజూరు చేస్తే.. కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా పీపీపీ విధానంలో కళాశాల అమ్మేయాలని చూస్తోందంటూ మండిపడ్డారు. తక్షణమే పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.

నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత

నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత

నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత

నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత

నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత