
గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ లింక్ తప్పనిసరి
తుమ్మపాల: గ్యాస్ సబ్సిడీ నగదు జమకాని లబ్ధిదారులు నేరుగా బ్యాంకుకు వెళ్లి తమ ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దీపం–2 పథకంలో భాగంగా 2వ విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, బ్యాంకు ఖాతాకు సబ్సిడీ నగదు జమపై అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24 ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 2వ విడత సిలిండర్ల పంపిణీలో 805 మందికి సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదన్నారు. ఇందుకు గల కారణాలు లబ్ధిదారులకు తెలియజేయాలని తెలిపారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ ఎన్‌పీసీఐ లింక్ అయిన తర్వాత మాత్రమే గ్యాస్ సబ్సిడీ నగదు జమ అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు, ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ డీలర్లు పాల్గొన్నారు.