
వైద్య కళాశాలలు ప్రభుత్వమే నిర్వహించాలి
రేపు మాకవరపాలెం
మెడికల్ కళాశాల వద్ద నిరసన
అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ పాలనలో పేద విద్యార్ధులకు మెడికల్ సీట్లు రావాలని, పేద రోగులకు సకాలంలో వైద్యసేవలు అందాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ చేసి భవనాలు నిర్మిస్తే, 2023 ఏడాదిలో ఆరు మెడికల్ కళాశాలల్లో మెడికల్ విద్యార్దులు విద్యను అభ్యసిస్తుంటే, కూటమి పాలనలో మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తోందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ అన్నారు. దీనిని నిరసిస్తూ ఈనెల 19న నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం అధ్యర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను టీడీపీ కార్పొరేట్ నాయకులకు ధారాదత్తం చేయడానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారన్నారు. పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నపరెడ్డి అదీప్‌రాజు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనలో విద్య, వైద్యం రెండు నేత్రాలుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేస్తే, సీఎం చంద్రబాబు పాలనలో విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పాలనలో విద్యార్థులకు ఫీజ్ రియింబర్స్‌మెంట్ చేసి పెద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించాలని చేస్తే, నేటి పాలనలో పేద విద్యార్ధులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్ కళాశాలలను దేశంలో ఎక్కడా ప్రైవేట్ పరం చేయలేదని, మన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మెడికల్ కళాశాలలను పీపీపీ పద్దతిలో కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు. ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విద్యార్ధి, యువజన విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్ మాట్లాడుతూ కూటమి 15 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలు విరక్తి చెందారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో అప్పగిస్తే రాష్ట్రంలో విద్యార్ధుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఽనిరసనలు చేయడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, మండల విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బాదపు హరికృష్ణ పాల్గొన్నారు.