
అరకొరగా యూరియా.. అన్నదాతల ఆందోళన
యూరియా కోసం రైతుల పడిగాపులు కొనసాగుతున్నాయి. చాలినన్ని బస్తాల యూరియా రాకపోవడంతో సర్వత్రా రైతుల్లో ఆందోళన నెలకొంది. మంగళవారం కూడా మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ తీరును రైతులు నిరసించారు.
మాడుగుల రూరల్: యూరియా కొరత రైతుల్ని ఇంకా వేధిస్తోంది. అరకొరగా వచ్చిన యూరియా నిల్వలతో రైతులు అందోళన చెందుతున్నారు. వరినాట్లకు సరైన సమయంలో అందించాల్సిన యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేసి రెండు మాసాలవడంతో యూరియా వేయక.. పంట దిగుబడిలో భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్నీ సవ్యంగా జరిగేవని, ఎరువుల కోసం ఇంతగా ఎదురుచూడాల్సిన దుస్థితి ఎప్పుడూ లేదని వాపోతున్నారు.
కనీసం యూరియా ఇవ్వకపోతే ఎలా?
మండలంలోని ఎం.కె.వల్లాపురం సహకార సంఘానికి 267 బస్తాల యూరియా వచ్చింది. మంగళవారం ఉదయం నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఈ సహకార సంఘం పరిధిలో గల గ్రామాలకు ప్రస్తుతం వచ్చిన యూరియా ఏమాత్రం సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేసి రెండు మాసాలు పూర్తి కావస్తున్న తరుణంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి దారుణంగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని ఎం.కోటపాడు గ్రామానికి చెందిన రైతు కోట్ని రామారావు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎరువులు కొరత ఏనాడూ చూడలేదని ఆక్షేపించారు.
సచివాలయం వద్ద ఆందోళన
జి.అగ్రహారం రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం మంగళవారం ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాశారు. ఈ కేంద్రానికి 240 బస్తాల యూరియా వచ్చింది. జి.అగ్రహారం, వీరనారాయణం సచివాలయాలు కలిపి ఒకే క్లస్టర్ కావడంతో ఈ రెండు సచివాలయాల పరిధిలోని మూడు గ్రామాలకు 80 బస్తాల చొప్పున అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ రెండు సచివాలయాల పరిధిలో 1600 మంది రైతులకు 240 బస్తాల యూరియా ఏ మేరకు సరిపోతుందని వైఎస్సార్‌సీపీ నాయకులు, చింతలూరు సర్పంచ్ కాళింగ కల్యాణరాజు వ్యవసాయ సిబ్బందిని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేయాలంటూ జి.అగ్రహారం, చింతలూరు, వీరనారాయణం రైతులు అందోళనకు దిగారు. స్థానిక ఎస్‌ఐ జి.నారాయణరావు తన సిబ్బందితో వచ్చి రైతులకు నచ్చజెప్పారు. గ్రామానికి 80 బస్తాలు చొప్పున సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. యూరియా అందని రైతులు ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు.
రావికమతం: దొండపూడి, కన్నంపేట, చినపాచిల రైతు సేవా కేంద్రాల వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు ఎగబడడంతో రైతు సేవా కేంద్రాల దగ్గర పోలీసులను మోహరించి వారి సమక్షంలో యూరియా విక్రయాలు జరిపారు. దొండపూడి రైతు సేవా కేంద్రానికి 150 బస్తాలు, కన్నంపేటకు 250 బస్తాలు, చినపాచిలంకు 140 బస్తాలు యూరియా సరఫరా అయ్యాయి.
దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంటలో మంగళవారం యూరియా కోసం రైతులు ఉదయం 8 గంటలకే అధిక సంఖ్యలో రైతులు చేరుకున్నారు. గంటల తరబడి నిలబడ లేక పలువురు రైతులు కూర్చుండిపోయారు. స్టాక్ అరకొర ఉందని తెలియడంతో తమకు దక్కుతుందో లేదోనని ఆందోళనతో ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. టోకెన్ల ప్రకారం పంపిణీ చేశారు. గంటల తరబడి క్యూలైన్‌లో పడిగాపులు కాసినా యూరియా దక్కక పోవడంతో పలువురు రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అడుగడుగునా ఇబ్బందులు
కూటమి ప్రభుత్వం రైతుల్ని నిలువునా ముంచేసింది. రైతు పండించే పంటకు ఎరువులు అందించలేని అధ్వాన స్థితిలో ఉంది. వరి నాట్లు వేసి రెండు మాసాలవుతోంది. ఇప్పటి వరకు ఎరువుల్లేక పంట నష్టపోయే పరిస్థితి. గత వైఎస్సార్‌సీపీ పాలనలో పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు ఎరువులు అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రైతులకు అడుగడుగునా ఇబ్బందులే తలెత్తుతున్నాయి.
–గాడి ముత్యాలనాయుడు, రైతు, వీరనారాయణం
ఎం.కె.వల్లాపురం
ఆర్‌ఎస్‌కేకు 267 బస్తాలు
వీరనారాయణం, జి.అగ్రహారానికి
కలిపి 240 బస్తాలు
పోలీసుల సమక్షంలో
యూరియా విక్రయాలు

అరకొరగా యూరియా.. అన్నదాతల ఆందోళన

అరకొరగా యూరియా.. అన్నదాతల ఆందోళన