
వైద్య విద్యపై కూటమి ప్రభుత్వం కుట్రలు దారుణం
వైఎస్సార్‌సీపీ ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ
దేవరాపల్లి: వైద్య విద్యపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేసి, వైద్య వృత్తిలోకి రావాలనుకునే పేద విద్యార్థుల కలల్ని నాశనం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ ఆరోపించారు. ఈ మేరకు దేవరాపల్లిలో మంగళవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. వైద్య విద్యకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యాతనిచ్చి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వంలోనే నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు సైతం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.