
బావిలో తేలిన మృతదేహం
ట్యాక్సీ డ్రైవర్‌గా గుర్తింపు ● ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ
యలమంచిలి రూరల్: పట్టణంలోని రాంనగర్ టిడ్కో గృహ సముదాయం వెనుక బావిలో తేలిన మృతదేహం యలమంచిలి పట్టణానికి చెందిన ట్యాక్సీ డైవర్ అప్పికొండ రమణ(59) గా పట్టణ పోలీసులు గుర్తించారు. స్థానిక ఫైర్ ఆఫీస్ కాలనీకి చెందిన మృతుడు కొన్నేళ్ల క్రితం భార్యతో గొడవ పడి ఒంటరిగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన రమణ జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అతని సమీప బంధువు అప్పికొండ చంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె. సావిత్రి మంగళవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. బావిలోంచి దుర్వాసన రావడంతో అక్కడ పశువుల కాపరి కొండలరావు మృతుని బంధువులకు సమాచారమిచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు. బావి పక్కనున్న ఎర్ర రంగు బ్యాగులో మృతుని గుర్తింపు కార్డు, చిరునామా లభించాయి. మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీయించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.