
బీఎన్ రోడ్డు బురదలో కూరుకుపోయిన వాహనాలు
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో బంగారుమెట్ట, ఎల్‌బీ పురం గ్రామాల మధ్య బురదలో వాహనాలు కూరుకుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నర్సీపట్నం నుంచి వడ్డాది వైపు వస్తున్న వ్యాను బంగారుమెట్ట సమీపంలో ఉన్న చర్చి వద్ద బురదలో కూరుకు పోయింది. దాని వెనకాలే వస్తున్న మరొక వ్యాను పక్క నుంచి వెళ్లే ప్రయత్నంలో అదీ బురదలో చిక్కుకుంది. రెండు వ్యాన్లు ఓకే గోతి వద్ద పక్క పక్కనే కూరుకుపోవడంతో ఇతర వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. దీంతో నర్సీపట్నం, వడ్డాది రూటులో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలూ నిలిచిపోయాయి. రాత్రిపూట వేగంగా ఇంటికి చేరుకోవాలని వెళ్తున్న రావికమతం, కొత్తకోట, రోలుగుంట, చోడవరం, వడ్డాది, అనకాపల్లి, విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లే పలువురు ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. చీకట్లో ఎటూ వెళ్లలేక నరకయాతనపడ్డారు. ఉదయం కూడా ఇదే గోతి వద్ద వ్యాన్ ఇతర వాహనాలు కూరుకుపోగా ట్రాక్టర్ల సహాయంతో బైటకు లాగారు. ఆర్ అండ్ బీ అధికారులు తక్షణం ఈ గోతిని పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.
వడ్డాది, నర్సీపట్నం రోడ్డులో
నిలిచిపోయిన వాహనాలు