
మత్స్యకారులపై ప్రభుత్వ నిర్బంధం అన్యాయం
అనకాపల్లి: రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులు, సీపీఎం నాయకులపై కూటమి ప్రభుత్వం ఉద్యమ కారులపై ఉక్కుపాదం మోపడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్.శంకరరావు అన్నారు. స్థానిక జోనల్ కార్యాలయంలో వద్ద పార్టీ ఆధ్వర్యంలో బల్క్‌డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులను మోహరించి మత్స్యకారులపై, సీపీఎం నాయకులపైన నిర్బంధం ప్రయోగించి శాంతియుత పోరాటాన్ని అణచివేయాలనే చూస్తే ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు. ప్రజాస్వామ్యంలో తమ నిరసనను స్వేచ్ఛగా తెలియజేసే హక్కు ప్రజలకు ఉందని, బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్న మత్స్యకారులపై పోలీసులు కేసులు పెడతామని బెదిరించి వారిని భయబ్రాంతులకు గురిచేయడం అన్యాయమన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్‌డ్రగ్ పార్కు ప్రమాదకరమని చెప్పి వారి పోరాటంలో పాల్గొన్న టీడీపీ నాయకులు నేడు అధికారంలోకి రాగానే మాటమార్చడమంటే మత్స్యకారులను మోసం చేయడమేనన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, స్థానిక వ్యతిరేకతను లెక్కచేయకుండా ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గంటా శ్రీరామ్, అల్లు రాజు, నాయకులు పి.చలపతి,నాగిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.