
మిడిసి పడుతున్న పసిడి
10 గ్రాముల ధర రూ.1.11 లక్షల పైమాటే..
ఇప్పట్లో రూ.లక్ష దిగువకు వచ్చే
సూచనలు లేవంటున్న వ్యాపారులు
అదే బాటలో దూసుకుపోతున్న వెండి
ధరలు పెరిగినా మార్కెట్ జోరు తగ్గలేదు
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: పసిడితో భారతీయులకు ఉన్న అనుబంధం మరే దేశంలోనూ కనిపించదు. చేతిలో కొద్దిగా డబ్బులు కనిపిస్తే.. వెంటనే కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. పుత్తడి కొంటే.. శుభసూచకమని అంటుంటారు. అందుకే స్వర్ణం.. సమస్తమయమైపోయింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ నేపథ్యంలో రోజురోజుకీ పసిడి ధర ౖపైపెకి ఎగబాకుతూ.. ఆల్‌టైమ్ హై రేట్‌ని నమోదు చేస్తోంది. ఒకప్పుడు 10 గ్రాముల ధరతో ఇప్పుడు గ్రాము కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. వారం రోజులుగా ఎగబాకుతున్న బంగారాన్ని చూసి.. వెండి కూడా అదే బాటలో దూసుకుపోతోంది. లక్ష రూపాయల కంటే దిగువకు బంగారం ధర దిగే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.
బంగారానికి ఇంత వన్నె ఎందుకో..?
పుత్తడి ఎంత ఉన్నా సగటు వ్యక్తికి మోజు తీరడం లేదు. తన శక్తి మేరకు బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు బంగారానికి ఇంత వన్నె ఉండటానికి కారణం అంతర్జాతీయ కరెన్సీకి ప్రత్యామ్నాయం కావడమే. ఒక దేశం జారీ చేసిన నోట్లు చెల్లకపోవడం. వాటి విలువ క్షీణించడం ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి బేధాలేమీ లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కొంత ధరకు చలామణీ అవుతుంది. అందుకే స్వర్ణానికి అంత కళ. ధర తగ్గినా పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు.
పెట్టుబడి
విషయంలోనూ బంగారమే..!
రోజు రోజుకీ ధర పెరుగుతూ వస్తున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ప్రజలు అస్సలు తగ్గేదే..లే అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పసిడి ఎంత ఉంటే అంత ఎక్కువ సొమ్ము ఉన్నట్లుగా భావిస్తారు. వాస్తవానికి బంగారం నిరర్థక ఆస్తి. ఎంతో కష్టించి సంపాదించిన సొమ్ము బంగారంగా మార్చితే బీరువాల్లోనూ, బ్యాంకు లాకర్లలోనూ భద్రంగా ఉంచడం తప్ప... మరో ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తులో ధర పెరిగి, పెరిగిన ధరకు దాన్ని విక్రయిస్తేనే లాభం. మనకు తెలిసినంత వరకూ బంగారం కొనడమే కానీ.. విక్రయించడమన్నది అరుదు. దీని బదులు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వెచ్చిస్తే సంపద సృష్టి జరుగుతుంది. మన దేశంలో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో బంగారం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సరకు బంగారమేనన్నది విస్మయపరిచే అంశం. ఇటీవల కాలంలో మనదేశంలో బంగారం కొనుగోళ్లు అధికమై.. నగదు పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గృహస్తులు ఇతర వాటిపై ఒక్క శాతం పెట్టుబడులు పెడుతుండగా బంగారంపై మాత్రం ఆరున్నర రెట్లు ఎక్కువ మొగ్గు చూపుతుండటం విశేషం.
గత వారం రోజులుగా బంగారం ధర తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1,08, 380 ఉండగా.. 9వ తేదీన రూ.1,10,290కి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.10 లక్షలకు తక్కువ కాలేదు. వెండి కూడా ధగధగ మెరిసిపోతోంది. ఈ నెల 8న కిలో వెండి ధర రూ.1.37 లక్షలు ఉండగా.. 15వ తేదీ నాటికి రూ.6 వేలు పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు దాదాపు రూ.1000 చొప్పున పెరుగుతూ వస్తోంది.
గత వారం రోజులుగా 10 గ్రాముల బంగారం, కిలో వెండి ధరలు
రోజురోజుకూ
పెరుగుతున్న పుత్తడి ధర

మిడిసి పడుతున్న పసిడి

మిడిసి పడుతున్న పసిడి