
మెడికల్ కాలేజీ సాధనకు ఉద్యమ కార్యాచరణ
● ఈనెల 18న శాంతియుత నిరసన
● దశలవారీగా ఉద్యమం ఉధృతం
● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం: మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించేలా ఒత్తిడి తెచ్చేందుకు దశలవారీగా ఉద్యమానికి కార్యాచరణ రూపొందించామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీ అత్యంత అవసరమన్నారు. ప్రజాభీష్టాన్ని శాసనసభ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈనెల 18న మున్సిపల్ స్టేడియంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విధిగా హాజరై మన నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలన్నారు. మైదాన, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే మెడికల్ కాలేజీ అవసరమన్నారు. పీపీపీ విధానం వల్ల కాలేజీ ప్రైవేటుపరమైతే అన్ని రకాల వైద్యసేవలకు డబ్బు చెల్లించాల్సి వస్తుందన్నారు.
అనుమతి కోరుతూ సీఐకి వినతి
సమావేశం ముగిసిన వెంటనే పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ టౌన్ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ గోవిందరావును కలిసి ఈనెల 18న చేపడుతున్న శాంతియుత నిరసనకు అనుమతి కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీలు సుర్ల గిరిబాబు, అప్పలనర్స, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, రుత్తల సర్వేశ్వరరావు, గజ్జలపు మణికుమారి, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, పార్టీ మండల అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, ఫణి శాంతరామ్, నాగేశ్వరరావు, చిటికెల రమణ, తదితరులు ఉన్నారు.