
సీపీఎం నేత అప్పలరాజు గృహ నిర్బంధం
అప్పలరాజు ఇంటి ముందు పోలీసుల కాపలా
నక్కపల్లి: బల్క్‌డ్రగ్ పార్క్‌ను రద్దు చేయాలని కోరుతూ రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును సోమవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో అప్పలరాజు తన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా ఉంచారు. కొద్ది నెలలుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు అప్పలరాజు తదితరులు సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆదివారం వారి దీక్షలో అప్పలరాజు పాల్గొన్నారు. దీంతో పోలీసులు అప్పలరాజుకు 41 నోటీసులు జారీ చేసి కేసులు నమోదు చేశారు. సోమవారం ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉద్యమాలను అణగదొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అప్పలరాజు ఆరోపించారు. మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిశ్రమల ఏర్పాటును విరమించుకోవాలన్నారు. అప్పలరాజును అడ్డుకోవడంతో రాజయ్యపేటలో జరిగిన ఆందోళనలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజేష్, ఎం.సత్యనారాయణలు పాల్గొని సంఘీభావం తెలిపారు.