
‘తాండవ’లో పుష్కలంగా నీటి నిల్వలు
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటి మట్టం నిలకడగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగుకు పంట కాలువల ద్వారా ఆగస్ట్ 10న నీటిని విడుదల చేశారు. ఆ సమయానికి తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం 372.0 అడుగులు ఉండేది. ఆ రోజు నుంచి ప్రధాన కాలువల ద్వారా రోజు ఒక్కంటికి 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తరచూ వర్షాలు కురియడంతో తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గకుండా పెరుగుతుంది. సోమవారం సాయంత్రానికి తాండవలో నీటి మట్టం 375.5 అడుగులు ఉంది. ప్రస్తుతం పంట కాలువల ద్వారా విడుదల చేసే నీరు కంటే ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో అధికంగా రావడం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడం లేదని ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగుకు శివారు ఆయకట్టుకు సైతం సకాలంలో నీటిని సరాఫరా చేశామని, రైతులంతా పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించారు.