
బెల్టు షాపులతో పేదల జీవితాలు ఛిద్రం
● గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకోరా?
● మాడుగుల ఎకై ్సజ్ కార్యాలయం
ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
మాడుగుల రూరల్: నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్టుషాపుల ఏర్పాటుతో పేదల జీవితాలు ఛిద్రమవుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న ధ్వజమెత్తారు. మాడుగుల ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట సోమవారం ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ బెల్టుషాపులు నిర్వహిస్తూ పేదలు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్వక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన లైసస్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో బెల్ట్ దుకాణాలతో పాటు పాన్‌షాపులు, డాబాలు, టీ షాపుల్లో సైతం యథేచ్ఛగా మద్యం విక్రయాలు చేపడుతున్నారన్నారు. ఎంఆర్‌పీ కంటే బెల్టుషాపుల్లో బాటిల్‌పై రూ.40 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార వేలం పాటలు నిర్వహించి, గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బెల్టుషాపులు, అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని అనంతరం కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం దేవరాపల్లి మండల కార్యదర్శి బి.టి.దొర, వంతల కేశవరావు, దాసు పాంగి మత్యరాజు, పాంగి విజయ, పార్టీ మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి, కె.భవానీ, తదితరులు పాల్గొన్నారు.