
వెంటాడుతున్న యూరియా కష్టాలు
7వ పేజీ తరువాయి
క్యూలైన్లలో గంటల కొద్ది పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్‌లో నిరీక్షణ చేసినా యూరియా దొరకక పలువురు రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటికే పలుమార్లు అధికార్లు వచ్చి యూరియా కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, సరిపడా యూరియ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని పలువురు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాగాపురంలో రైతుల ఆందోళన
గొలుగొండ: యూరియా కొరత వలన రైతులు నాగాపురం గ్రామ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కూటమి సర్కార్ రైతులకు న్యాయం చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపించారు. గ్రామంలో వరి, పత్తి, కూరగాయాలతోపాటు ఇతర పంటలు వేయగా సకాలంలో యూరియాతోపాటు ఇతర ఎరువులు లేకపోవడం వలన పంటలు నాశనం అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. నాగాపురం పంచాయతీలో ఎంత వ్యవసాయ భూమి ఉంది.. ఎన్ని రకాల పంటలు సాగు చేస్తారు.. వారికి ఎంతమేర ఎరువులు అవసరం అని ఆలోచించుకోవద్దా అని నిలదీశారు. రైతులు యర్రా వరహాలు, పి.భూషణం, రామకృష్ణ, త్రినాథ్, నాగ సత్యనారాయణ పాల్గొన్నారు.