పాయకరావుపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) టర్నోవర్ రూ.3 వేల కోట్లకు పెంచాలన్న ధ్యేయంతో పని చేస్తున్నట్టు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు తెలిపారు. పట్టణంలోని బ్యాంచిలో ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం రూ.2700 కోట్ల టర్నోవర్‌లో ఉందన్నారు. కొత్తగా భీమిలీ, ఆనందపురంతో పాటు అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో కూడా బ్యాంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న 92 పీఏసీఎస్‌లను కంప్యూటరీకరిస్తామన్నారు. తమలపాకు రైతులకు లక్ష రూపాయల రుణం అందిస్తున్నామని, దీనిని రూ.3 లక్షలకు పెంచుతామన్నారు. రైతులకు ఇతర అవసరాలకు కూడా జీరో వడ్డీతో రూ.2 లక్షలు వరకు క్రాప్ రుణం అందిస్తున్నామన్నారు. హౌసింగ్, ఎడ్యుకేషన్, మార్ట్‌గేజ్, ఖాళీ స్థలాలకు, చిన్న పరిశ్రమలకు కూడా రుణాలు మంజూరు చేస్తామన్నారు. పేదలకు గొర్రెలు, గేదెలు, పౌల్ట్రీ, డైరీల ఏర్పాటుకు 50 శాతం రాయితీపై నాబార్డు లింకేజ్ ద్వారా రుణాలు అందిస్తామన్నారు. అతి తక్కువ రుణాలు కలిగి ఉండి చెల్లించలేని పేదలకు ఓటీఎస్ అమలు చేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులకు రూ.432 కోట్ల రుణాలు అందిమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ బోడపాటి శివదత్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, డీసీసీబీ సీఈవో డి.వి.ఎస్.వర్మ, మేనేజరు కె.ఎల్ శిల్ప, ఫీల్డ్ ఆఫీసర్ సతీష్, నోడల్ ఆఫీసర్ ఎల్‌కేఎన్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.