
పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా
● తప్పనిసరిగా వేయించాలి
● జేసీ జాహ్నవి పిలుపు
తుమ్మపాల: నాలుగు నెలలు దాటిన ప్రతి పశువుకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా వేయించాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో పాడి రంగం అభివృద్ధికి అధికారులు నిర్ణీత సమయంలో టీకా కార్యక్రమం జరపాలని, గాలికుంటు వ్యాధి పూర్తిగా నిర్మూలించాలన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రామమోహనరావు మాట్లాడుతూ జిల్లాలో 3,54,200 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని, నెల రోజులపాటు టీకా కార్యక్రమం రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎస్‌డీసీ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.