
బహిరంగ ప్రదేశాల్లో కోళ్ల కళేబరాలు పడేస్తే కఠిన చర్యలు
కె.కోటపాడు పశు సంవర్ధకశాఖ ఏడీ దినేష్‌కుమార్
దేవరాపల్లి: బహిరంగ ప్రదేశాల్లో కోళ్ల కళేబరాలను పడేస్తే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కె.కోటపాడు పశు సంవర్ధకశాఖ ఏడీ ఈ.దినేష్‌కుమార్ హెచ్చరించారు. మండలంలోని చేనులపాలెం కల్లాలు సమీపంలో సాగు నీటి చెరువు, కాలువల్లో గుట్టలు గుట్టలుగా పడేసిన కోళ్ల కళేబరాలను స్థానిక పశు వైద్యాధికారులు జి.గాయత్రీదేవి, కె.మంజుషారాణి, జి.ప్రియాంకతో కలిసి ఆదివారం పరిశీలించారు. స్థానిక పంచాయతీ సెక్రటరీ స్వామినాయుడు, వీఆర్‌వో రాజేంద్రకుమార్‌ల సమక్షంలో చెరువులోంచి వాటిని బయటకు తీయించి, గోతిలోపూడ్చి వేశారు. ఈ సందర్భంగా ఏడీ దినేష్‌కుమార్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో కోళ్లు లేదా ఇతర జంతువుల కళేబరాలను పడేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు.