
ముగ్గురు జైలు సిబ్బందికి చార్జి మెమోలు
చోడవరం: సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీ లు పరారైన సంఘటనకు సంబంధించి ముగ్గురు చోడవరం సబ్‌జైలు అధికారులకు జైళ్లశాఖ అధికారులు గురువారం చార్జి మెమోలు జారీ చేశారు. ఈనెల 5వ తేదీన చోడవరం సబ్ జైలులో నక్కా రవికుమార్, బెజవాడ రాము అనే ఇద్దరు రిమాండ్ ఖైదీలు విధినిర్వహణలో ఉన్న జైలు వార్డర్‌ను సుత్తి తో తలపై కొట్టి గాయపరిచి ఆయన జేబులో ఉన్న తాళాలను తీసుకొని మెయిన్‌గేటు తీసుకొని పరారయిన విషయం తెలిసిందే. తర్వాత 24 గంటలు తిరగకముందే టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పరారైన ఇద్దరు ఖైదీలను పట్టుకొని అరెస్టు చేశారు. అయితే ఎంతో పగడ్బందీగా ఉన్న సబ్‌జైలు నుంచి ఖైదీలు ఇంత సునాయాసంగా పరారవ్వడానికి గల కారణాలపై ఎస్పీ తుహిన్‌సిన్హాతోపాటు జైలు శాఖ ఉన్నతాధికారులు అదే రోజు విచారణ చేశారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని గుర్తించిన అధికారులు ఆ సమయంలో విధినిర్వహణలో ఉన్న జైలు సూపరింటెండెంట్ బాబూరావు, హెడ్‌వార్డర్ వి.వీర్రాజు, వార్డర్ ఎం.అప్పలనాయుడుకు చార్జి మెమో జారీచ ేశారు. సంఘటన జరిగిన సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక హెడ్ వార్డరు మెయిన్ గేటు దగ్గర, సబ్‌జైలర్ తన గదిలో విధినిర్వహణలో ఉన్నారు. ఇంత జరగడానికి విధి నిర్వహణలో ఉన్న జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ జైలుశాఖ ఉన్నతాధికారులు ముగ్గురికి చార్జి మెమోలు జారీ చేశారు. వారి వివరణ అనంతరం తరుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.