
మృతి చెందిన ఖైదీ కుటుంబానికి ఆర్థిక సహాయం
రూ.5 లక్షల చెక్కును అందిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: విశాఖపట్నం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ 2023 సెప్టెంబర్ 12న మరణించిన రావికమతం మండలం గుమ్మలపాడు గ్రామానికి చెందిన మామిడి అర్జున కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్ మృతుని భార్య రమణమ్మ, కుమార్తె మౌనికదేవిలకు చెక్కును అందించారు. తమది నిరుపేద కుటుంబమని, ఆర్థిక భరోసా కల్పించాలని జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు అర్జీ సమర్పించడంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ మెజిస్టీరియల్ విభాగ పర్యవేక్షకుడు ఎస్.వి.ఎస్.వాసునాయుడు పాల్గొన్నారు.