
అన్నదాతల ధర్మాగ్రహం
నక్కపల్లి: తీసుకున్న భూములకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా, అదనంగా వేలాది ఎకరాల భూములు సేకరించేందుకు పూనుకున్న కూటమి ప్రభుత్వ వైఖరిపై తాడోపేడో తేల్చుకునేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. గతంలో ఇచ్చిన మాట తప్పి ప్యాకేజీ ఎగ్టొట్టే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు సర్కారు వైఖరిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. సోమవారం చందనాడ, అమలాపురం, పాటిమీద, మూలపర, తమ్మయ్యపేట, బోయపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులంతా భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రం నక్కపల్లి చేరుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు వంటా వార్పు నిర్వహించారు. అక్కడే భోజనాలు చేసి సాయంత్రం వరకు ఆందోళన నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించి కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని నమ్మబలికి 2014లో భూసేకరణ చేశారన్నారు. అప్పట్లో చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితలను నమ్మి రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. కేవలం పరిహారం మాత్రమే చెల్లించి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళనకు నాయకత్వం వహించిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు ఎం.అప్పలరాజు, సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపిటీసీ సభ్యుడు గంటా తిరుపతిరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా గ్రీవెన్స్ విబాగం అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు ఆరోపించారు. ఇప్పుడు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.8.90 లక్షలు చెల్లిస్తామని చెబుతున్నారన్నారని, ఇది ఏ మూలకు సరిపోదన్నారు. భూములు స్వాధీనం చేసుకున్న సమయానికి నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లుగా ఉన్న ఆడ, మగవారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
కూటమి పెద్దల కోసమే అదనపు భూసేకరణ
ఇప్పటికే మండలంలో 4500 ఎకరాలు సేకరించి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. అదనంగా కాగిత, నెల్లిపూడి, వేంపాడు డీఎల్ పురాల్లో 2500 ఎకరాలు, సిహెచ్‌ఎల్ పురం, జానకయ్యపేట, పెదతీనార్ల, గుర్రాజు పేటలలో 790 ఎకరాలు అదనంగా తీసుకునేందుకు నిర్ణయించిందన్నారు. రైతుల ఆమోదం లేకుండా పత్రికల్లో 6 ఏ ప్రకటన విడుదల చేసిందన్నారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు అదనంగా భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. పేదల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అనంతరం తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు అయినంపూడి మణిరాజు, రైతులు తళ్ల అప్పలస్వామి, తాతారావు, వంకా కృష్ణ, శంకరశెట్టి చిన్నా, రామలక్ష్మి, చిన్నమ్మలు, చంటమ్మ, మనబాల రాజేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
గత్యంతరం లేక రోడ్డెక్కాం
కంపెనీల కోసం భూములు, ఇళ్లు త్యాగం చేశాం. ఊరు ఖాళీ చేసి వేరొక చోటకు వెళ్లి బతకడం అంటే గుండె చెరువైపోతోంది. సర్వం కోల్పోయిన మాకు ప్రభుత్వం అరకొరగా పరిహారం ఇవ్వడం ఎంతవరకు సమంజసం. ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించమని ఏడాది నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గత్యంతరం లేక రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.
–సూరాకాసుల రామలక్ష్మి, మూలపర
ఊరు వదిలి పొమ్మంటున్నారు
అప్పట్లో భూములు తీసుకు నేటప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నా రు. పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడు భూములు ఇచ్చేశాం. పదేళ్లయింది. ఎన్నో మార్పులు జరిగాయి. ధరలు పెరిగాయి. ఇవే భూములను నమ్ముకుని జీవించాలి. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలి. ఇప్పుడు డబ్బులు తక్కువ ఇత్తామంటున్నారు. ఊరు ఖాళీ చేసి ఇంకో దగ్గరకు పొమ్మంటున్నారు.
–పెంటకోట చిన్నమ్మలు, అమలాపురం
తీసుకున్న భూములకు ప్యాకేజీ ఇవ్వలేదు
కొత్తగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ
మాట తప్పిన చంద్రబాబు సర్కారు
వంట, వార్పుతో నిరసన తెలిపిన నిర్వాసితులు, రైతులు
నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

అన్నదాతల ధర్మాగ్రహం

అన్నదాతల ధర్మాగ్రహం

అన్నదాతల ధర్మాగ్రహం