
బ్రిటిష్ సమాధుల స్ధలాన్ని పరిరక్షించండి
● ఆక్రమణలపై స్పీకర్ నోరు విప్పాలి ● సీపీఎం నాయకుల డిమాండ్
అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, నాయకులు
నర్సీపట్నం: బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధికారులను డిమాండ్ చేశారు. సీపీఎం బృందం ఈ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి పరిణామం జరగడం బాధాకరమన్నారు. స్పీకర్ నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అల్లూరి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి చిహ్నంగా ఉన్న బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిటిష్ సమాధుల స్థలాన్ని ఆక్రమించేసి, నిర్మాణాలు చేపడుతుంటే కాపాడాల్సిన రెవెన్యూ, మున్సిపల్, పురావస్తుశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ నిర్మాణాలకు రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అనుమతులు ఉన్నాయా..? ఉంటే అనుమతులు ఎవరు ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు. దోషులపై చర్యలు తీసుకోవాలన డిమాండ్ చేశారు. ఆక్రమణలను పరిశీలించిన వారులో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు, సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, ఈరెల్లి చిరంజీవి తదితరులు ఉన్నారు.