
డ్రోన్ల సాయం.. లాభసాటి సేద్యం
● తగ్గనున్న పెట్టుబడి ఖర్చు.. నీటి ఎద్దడిని తట్టుకోనున్న పైరు ● డ్రోన్ సహాయంతో వరి విత్తనాలు చల్లే పద్ధతికి శ్రీకారం ● ఆర్‌ఏఆర్‌ఎస్‌లో పరీక్షించిన శాస్త్రవేత్తలు ● చీడపీడల బాధ తగ్గుతుందని ఆశాభావం
సాక్షి, అనకాపల్లి:
వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు యాంత్రీకరణ బాట పట్టాల్సిందే. ఇప్పటికే సాగులో దుక్కు, మందుల పిచికారీ వంటి పనులు యంత్రాల సాయంతో చేపడుతున్నారు. అలాగే డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగు మందులు, ఎరువులు చల్లటం వంటి పనులు కూడా చేస్తున్నారు. తాజాగా వరి సాగులో నారుకు బదులు నేరుగా డ్రోన్ సాయంతో విత్తనాలు వెద చల్లే పద్ధతికి సోమవారం అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ పరిశోధన స్థానంలో శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మారుతి డ్రోన్ సంస్థ సాంకేతిక సహకారంతో శాస్త్రవేత్తలు డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ గౌరీ, డాక్టర్ జగన్నాథరావు ఈ విధానాన్ని పరీక్షించారు. ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు పైరు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
73 శాతం విత్తనం ఆదా
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో 21 సెంట్ల పొడి నేలలో నాలుగు నిమిషాల్లో, 15 సెంట్ల తడి నెలలో 3.2 నిమిషాల్లో డ్రోన్ ద్వారా వరి విత్తనాలు వేశారు. సగటున 3.5 మీ/సె వేగంతో డ్రోన్ టెక్నాలజీతో విత్తనాలను నాటారు. ఈ పద్ధతిలో సగటున ఎకరాకు సుమారు 9 కేజీల వరి విత్తనాలు సరిపోతున్నాయి. ఇలా విత్తనాలను విత్తడానికి డ్రోన్‌కు ఒక ఎకరాకు 15 నిమి షాలు పడుతుంది. అయితే 21 సెంట్ల పొడి నేలలో 1.9 కేజీల విత్తనాలు చల్లడానికి మూడు నిమిషాలు పట్టింది. ఇదే సంప్రదాయ సాగు పద్ధతిలో ఎకరాలకు 30 నుంచి 35 కేజీల వరి విత్తనాలు అవసరం ఉంటుంది. డ్రోన్ ద్వారా విత్తే పద్ధతిలో 73 శాతం వరకు వరి విత్తనాలు ఆదా అవుతున్నాయి.
ఈ పద్ధతిలో పాటించాల్సిన జాగ్రత్తలు
విత్తిన వెంటనే తడిపేందుకు తేలికపాటి నీటి డ్రిప్ ఉండాలి
వరి నాటిన తర్వాత 7–10 రోజుల్లో మొలకల పరిస్థితిని పరిశీలించాలి
పొలాన్ని సమతలంగా చేయడం చాలా ముఖ్యం
విత్తనాలను వేసుకునే ముందే కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి