● కనీస సౌకర్యాల్లేని భవనాల్లో తూతూ మంత్రంగా శిక్షణ ● కొన్ని చోట్ల ఇరుకు గదులు, శిథిల భవనాల్లో ఏర్పాటు ● తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం లేక అవస్థలు ● ప్రభుత్వ నిధులతో ప్రైవేటు ఏజెన్సీల దోపిడీ పర్వం
దేవరాపల్లి: మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకుల పాలిట వరంగా మారాయి. ఈ కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఆ సంస్థలు మొక్కుబడిగా కొనసాగిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కర్డ్ (సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్), సేఫ్ (సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్‌మెంట్) ప్రైవేట్ సంస్థలు మహిళలకు శిక్షణిస్తున్నాయి. మూడు నెలల పాటు శిక్షణతో పాటు లబ్ధిదారులకు సుమారు రూ.6 వేలు విలువ చేసే కుట్టు మిషన్ ఉచితంగా అందించాలి. ఇందుకు కోసం ప్రైవేటు సంస్థలకు ఒక్కో మహిళకు రూ.21 వేలు చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ నిధులతో విశాలమై న భవనంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉండగా ఏజెన్సీ నిర్వాహుకులు మాత్రం మండలాల్లో ఖాళీగా ఉన్న శిథిల ప్రభుత్వ భవనాల్లో కుట్టు శిక్షణ కేంద్రాలను నడిపిస్తూ ప్రభుత్వ సొమ్మును లూటీ చేస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా కుట్టు మిషన్లు లేకపోవడంతో మిగిలిన వారంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఇరుకు గదుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయం కల్పించలేదు. క్లాత్ కటింగ్ కోసం టేబుల్ కూడా లేకపోవడంతో మహిళలు కటిక నేలపై కూర్చొని కట్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని బట్టి ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించిన మొత్తంలో సగం కూడా వెచ్చించడం లేదన్న సంగతి అర్థమవుతోంది.
జిల్లాలో 19 కుట్టు శిక్షణ కేంద్రాలు
అనకాపల్లి జిల్లాలో 19 చోట్ల కుట్టు శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 14 కేంద్రాలు ఖాళీగా ఉన్న ప్ర భుత్వ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, అనకాపల్లి అర్బన్, కె.కోటపాడు మండలాల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభం కాలేదు. జిల్లాలో ప్రస్తుతం 2,167 మంది ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్‌లుగా ఆయా కేంద్రాల్లో మహిళలు శిక్షణ పొందుతున్నారు.
40 మందికి 24 మిషన్లు
దేవరాపల్లి మండలంలో శిథిలావస్థలో ఉన్న పాత ఎంపీడీవో భవనంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భవనం చిన్నపాటి వర్షానికే స్లాబ్ కారిపోతోంది. దీంతో మిషన్లు, సామగ్రి తడిసిపోతున్నాయి. కుట్టు శిక్షణకు హాజరయ్యే 40 మంది మహిళలకు ఒక్కటే మరుగుదొడ్డి ఉంది. కొన్ని ఫ్యాన్లు సైతం పని చేయకపోవడంతో ఉక్కపోతతో మహిళలు అవస్థలు పడుతున్నారు. బ్యాచ్‌కు 40 మంది చొప్పున హాజరవుతుండగా.. 24 మిషన్లు ఏర్పాటు చేశారు. మాడుగుల, చీడికాడ మండలాల్లోని సచివాలయ భవనాల్లో కుట్టు శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
దేవరాపల్లి కేంద్రం త్వరలో మార్పు
జిల్లాలో 19 కుట్టు శిక్షణ కేంద్రాల్లో 2,167 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. వీటిలో 14 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. ఆరు కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. దేవరాపల్లిలో కుట్టు శిక్షణ కేంద్రం సమస్య తమ దృష్టికి వచ్చింది. శిథిలమైన ప్రభుత్వ భవనంలో నుంచి మరో చోటకు మార్పు చేయాలని సంస్థ నిర్వాహుకులకు సూచించాం. రెండు, మూడు రోజుల్లో వేరొక చోటుకు మార్పు చేసేలా చర్యలు తీసుకుంటాం.
– జి.పెంటోజీరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్, అనకాపల్లి జిల్లా
వేధిస్తున్న మరుగుదొడ్డి సమస్య
కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్న భవనంలో మరుగుదొడ్డి సమస్య వేధిస్తోంది. ఉదయం, మధ్యాహ్నం సుమారు 30 మందికి పైబడి మహిళలు హాజరవుతుండగా ఒకే మరుగుదొడ్డి ఉంది. అధికారులు తమ సమస్యలపై దృష్టి సారించాలి.
– కోట్ని సాయికుమారి,
ఎ.కొత్తపల్లి
రవాణా చార్జీలు ఇవ్వాలి
కుట్టు శిక్షణ కోసం సుమారు 12 కిలోమీటర్ల మేర రోజూ రాకపోకలు సాగిస్తున్నాం. ఇందు కోసం రోజుకు రూ.150 వరకు రవాణా ఇతరాత్ర ఖర్చులు అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి దూర ప్రాంతాల నుంచి వచ్చే తమలాంటి వారికి రవాణా ఖర్చులు అందించాలి. ప్రస్తుతం శిక్షణిస్తున్న భవనం ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నాం.
– తంగేటి సుగుణ, ఎన్.గజపతినగరం
కుట్టు శిక్షణ.. ప్రభుత్వ సొమ్ము భక్షణ
కుట్టు శిక్షణ.. ప్రభుత్వ సొమ్ము భక్షణ
కుట్టు శిక్షణ.. ప్రభుత్వ సొమ్ము భక్షణ