
బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలి
అనకాపల్లి: ఉపాధ్యాయులు బదిలీలు పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా జూన్, జూలై నెలల జీతాలు నేటికీ ప్రభుత్వం చెల్లించలేదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ విలీనగ్రామమైన కొత్తూరు డీఈవో కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడానికి కావలసిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. జిల్లాలో సుమారు ఎనిమిది వందల మంది ఉపాధ్యాయులు జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. పొజిషన్ ఐడీలు కోసం ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేయాలని, సంతకం ఎప్పుడవుతుందో తెలియదన్నారు. జూన్ నెలలో బదిలీలు పొందిన ఉపాధ్యాయుల జాబితాను విద్యాశాఖ అధికారులు జనవరి నెలలోనే సిద్ధం చేసినప్పటికీ, వారి జీతాల కోసం ఏర్పాట్లు చేయక పోవడం ఉన్నతాధికారుల నిర్లక్ష్యమేఅన్నారు. జిల్లా సహాధ్యక్షులు రొంగలి అక్కు నాయుడు మాట్లాడుతూ బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కంటే కూటమి ప్రభుత్వ హయాంలోనే ఉపాధ్యాయులు ఎక్కువ సమయాన్ని బోధనేతర పనులకు కేటాయించవలసి వస్తుందని విమర్శించారు. ఉపాధ్యాయులకు చదువు చెప్పే కార్యక్రమం తప్ప ఏ బోదనతర కార్యక్రమాలు అప్పాజెప్పకూడదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గుత్తుల సూర్యప్రకాష్, శేషు కుమార్, రమేష్ రావు, సీనియర్ నాయకులు జి.కె.ఆర్ స్వామి, అలమేలు , ఎల్లయ్య బాబు, ఉప్పాడ రాము, మామిడి బాబురావు, రవి, ఆశ, నూతన్, శివశ్రీ, సత్యవేణి, ఈశ్వర్, జగన్, దినకర్, అర్జున్, పీటర్ పాల్, వెంకట్, గణేష్ చంద్ర తదితరుల పాల్గొన్నారు.