
మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన క్వారీ లారీ
అనకాపల్లి టౌన్: పట్టణంలో పోలీసుల సాక్షిగా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే నాలుగు రోడ్ల జంక్షన్‌కు మెయిన్ రోడ్డు మీదుగా చేరుకున్న క్వారీ లారీ మహిళను ఢీ కొంది. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు తిరిగే క్రమంలో ఆమెను ఢీకొట్టి 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వెంటనే స్థానికులు పెద్దగా కేకలు వేసి లారీ డ్రైవర్‌కు సైగ చేయగా ఆపాడు. ఈలోగా అక్కడే ఉన్న పట్టణ సీఐ విజయ్‌కుమార్ స్పందించి మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో ఎన్టీఆర్ ఆస్పత్రికి క్షతగాత్రురాలిని తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. వాస్తవానికి ఈ ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి ముందు కార్గిల్ విజయోత్సవ ర్యాలీ జరిగింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. అందువల్ల నెమ్మదిగా క్వారీ లారీ వెళ్లిందని, లేకపోతే స్పీడుగా వెళ్తే ప్రాణాలు పోయేవని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా వేళ కాని వేళలో మెయిన్ రోడ్డు మీదుగా క్వారీ లారీ ఎలా వచ్చిందని, ఇది ఎవరిదని వదిలేశారంటూ బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదు చేయకుండా బాధితురాలితో రాజీకి చేసుకున్నట్టు సమాచారం.