
ఎద్దుల బండిపై ఊరేగిన పెళ్లికూతురు
పూర్వకాల పద్ధతిని చూసి మురిసిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
బుచ్చెయ్యపేట: పెళ్లి అనేది ఒక మధుర జ్ఞాపకం.. దాని కోసం నేటి యువత తమ అభిరుచి ఆలోచనలకు తగ్గట్టుగా వేడుక చేసుకుంటోంది. చైన్నెలో ఓ జంట సాగరం గర్భంలో వివాహం చేసుకోగా, పంజాబ్‌లో మరో జంట పంట పొలాల్లో పెళ్లి వేడుక చేసుకుంది. ఇక శుభలేఖల నుంచి ఇతర సారె, సరంజామా వరకు వినూత్న పద్ధతులతో ఆకట్టుకుంటున్నారు. ఇదే కోవలో బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెంలో శనివారం జరిగిన పెళ్లి వేడుక అలనాటి వివాహ వైభవాన్ని తలపించింది. హైటెక్ యుగంలో ఖరీదైన కార్లలో ఊరేగుతున్న వధువులకు భిన్నంగా ఓ వధువు ఎడ్లబండిపై వరుడి ఇంటికి వచ్చి ఆశ్చర్యపరిచింది.
రవాణా సదుపాయాల్లేని పూర్వ రోజుల్లో ఎడ్లబళ్లు, గుర్రపు జట్కాలపై పెళ్లికుమార్తెతోపాటు సారెను పెళ్లింటికి సాగనంపేవారు. అదే పద్ధతితో పెళ్లి కుమార్తె లావణ్యను పది ఎడ్లబళ్లతో పలు గ్రామాల మీదుగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం వరుడితో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఊరేగింపు చేశారు. పొట్టిదొరపాలేనికి చెందిన కోఆపరేటివ్ సెక్రటరీ దరిమిశెట్టి మహాదేముడు కుమారుడు మోహనకృష్ణ రవితేజనాయడుకు రావికమతం మండలం మరుపాక మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకుడు పండూరి సత్తిబాబు కుమార్తె లావణ్యకు జరిపించిన ఈ వివాహ వేడుక పలువురిని ఆకట్టుకుంది.
పెళ్లికుమార్తె లావణ్య ప్రస్తుత గ్రామ సర్పంచ్ కాగా, ఇటీవల బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేయడం గమనార్హం. ఈ వేడుకలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి గుడివాడ అమర్‌నాథ్ పాల్గొని పూర్వకాలం వివాహ వేడుకను ఈతరం యువతకు చూపించావు అంటూ పెళ్లి కుమార్తెను అభినందించారు. వధూవరులిద్దరిని బుచ్చెయ్యపేట, రావికమతం మండల నాయకులతో కలిసి ఆశీర్వదించారు.