
‘అమ్మ పేరిట ఒక మొక్క’తో మానవ సంబంధాలు వృద్ధి
అనకాపల్లి: మానవ సంబంధాల పెంపుదలకు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో మొక్కలు నాటాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆఫ్ ఇండియా సీనియర్ ఆడిటర్ కె.ఎన్.రాజు అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక మెయిన్‌రోడ్డు జీవీఎంసీ పెద్ద హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో శనివారం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమం క్యాంపెయిన్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడానికి ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమం తల్లులు అందించే సంరక్షణ, వృద్ధికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవవైవిధ్యానికి దోహదపడే మొక్కలను మాత్రమే నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు మాతృభక్తి, పర్యావరణం పట్ల ప్రేమ కలుగుతుందని ఆయన చెప్పారు. ‘అమ్మ పేరిట ఒక మొక్క’ అనేది ప్రేమ, బాధ్యత, భవిష్యత్ పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచే మార్గమవుతుందన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గొర్లి మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కుసుమావతి, అధ్యాపకులు కె.వి.ఎస్.ప్రభాకర్, వై.ఎల్.అక్షయ, విద్యార్థులు పాల్గొన్నారు.