
రోడ్డెక్కిన ఎండీయూ వాహనదారులు
కోటవురట్ల: ఎండీయూ వాహనదారులు రోడ్డెక్కా రు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తే కూటమి ప్రభుత్వం రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఎండీయూ వాహనదారులు శనివారం ఆందోళన చేపట్టారు. ఎండీయూ వాహనాలను స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద నిలిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమను కొనసాగించాలని నినాదాలు చేశారు. వారికి మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు డి.వి.సూర్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు. అనంతరం తహసీల్దారు తిరుమలబాబుకు వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు ఇంటికే రేషన్ సరుకులు అందివ్వాలనే ఆశయంతో ఎండీయూ వాహనాలను ప్రవేశ పెట్టిందన్నారు. తద్వారా రాష్ట్రంలో 9,260 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ అమలు చేయకపోగా, గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలను తీసేస్తూ పేదలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. అప్పటి పథకాలను ఏదో రకంగా తీసేసి జగన్ పేరు వినపడకుండా చేయాలని కంకణం కట్టుకుందన్నారు. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనదారులకు ప్రతి నెలా 5వ తేదీలోపు రూ.21 వేలు వేతనం వారి అకౌంట్లలో జమ చేసేదన్నారు. దాంతోనే వెహికల్ ఈఎంఐ కట్టుకుని మిగిలిన డబ్బులతో కుటుంబాలను పోషించుకునేవారన్నారు. ఎండీయూ వాహనదారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక, పది నెలలుగా వేతనాలు కూడా సక్రమంగా చెల్లించలేదన్నారు. పదో తేదీ తరువాత చెల్లించడం వల్ల చెక్ బౌన్స్ అయ్యి సిబిల్ స్కోర్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ నెలలో తమ ప్రమేయం లేకుండానే తమ అకౌంట్లలోని వేతనంలో రూ.8 వేలు తీసేసుకుందని ఆరోపించారు. ఎప్పటిలానే ఈ పథకాన్ని కొనసాగించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్ సత్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉమ్మలాడలో ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
మునగపాక: ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులను ఇంటింటికీ సరఫరా చేస్తున్న ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ ప్రశ్నించారు. మండలంలోని ఉమ్మలాడ జాతీయ రహదారిపై శనివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. వలంటీర్ వ్యవస్థను తొలగించి వారిని మోసం చేసిందన్నారు. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి రేషన్ అందిస్తుంటే, దాన్ని తొలగించి డిపోల వద్దకు వెళ్లి రేషన్ తీసుకునేలా పూనుకోవడం తగదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి అప్పారావు, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, బొడ్డేడ బుజ్జి, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు బొడ్డేడ లిల్లి, పార్టీ నేతలు బొడ్డేడ బుజ్జి, మొల్లేటి వినోద్, మురళి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పథకాన్ని కొనసాగించాలని డిమాండ్

రోడ్డెక్కిన ఎండీయూ వాహనదారులు