
పేదలపై కక్ష రాజకీయాలు
కోటవురట్ల: కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు డి.వి.సూర్యనారాయణరాజు ధ్వజమెత్తారు. మండలంలోని గొట్టివాడ జగనన్న కాలనీలో కట్టుమూరి అప్పారావు నిర్మించుకున్న ఇంటిని రెవెన్యూ అధికారులు పాక్షికంగా కూలగొట్టిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, పార్టీ నాయకులు శనివారం ఇల్లును పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ హోం మంత్రి అనిత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే పేదలపై కక్షా రాజకీయాలు చేయడం దారుణమన్నారు. బాధితుడు స్టేటస్ కో తీసేస్తే ఇల్లు కట్టుకోవచ్చని నమ్మించి ఇప్పుడు పాక్షికంగా కూలగొట్టారని ఆరోపించారు. బాధితుడి తరపున న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ సుంకపూరుకు చెందిన టీడీపీ నేత సుమారు రూ.కోటి విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టడాలు నిర్మిస్తుంటే చోద్యం చూస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్ సత్యనారాయణరాజు, మాజీ ఎంపీటీసీ యల్లపు కుమారరాజా, పార్టీ గ్రామ అధ్యక్షుడు రాచపతి వెంకటరావు, నాయకులు కట్టుమూరి అప్పారావు, సుంకర గిరి, నాగేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు