
వ్యక్తిగత ఆరోగ్యంపై పోలీసులు దృష్టి సారించాలి
ఎంవీపీకాలనీ(విశాఖ): పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రిలో శనివారం పోలీస్ సిబ్బందికి ఉచిత ఆర్యోగ పరీక్షల శిబిరం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ రోజువారి విధుల ఒత్తిడిలో పోలీసులు ఆరోగ్య సమస్యలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోషకాలతో కూడిన మితాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ దిశగా వారి కుటుంబ సభ్యులు సైతం సహకారం అందించాలన్నారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికవర్ హాస్పిటల్ సహకారంతో సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 750 మంది ఈ సేవలను వినియోగించుకున్నారన్నారు. గుండె, కిడ్నీ, మామోగ్రఫీ తదితర 13 రకాల పరీక్షలు మెడికర్ హాస్పిటల్, అచ్యుతాపురానికి చెందిన రుషిల్ డెకర్స్ సహకారంతో ఉచితంగా చేసినట్లు చెప్పా రు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ డాక్టర్ సిహెచ్.అరుణ్‌కుమార్, రుషిల్ డెకర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎ.కె.రాయ్, అదనపు ఎస్పీలు దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీటీసీ డీఎస్సీ బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.