
మహిళల రక్షణను పట్టించుకోని ప్రభుత్వాలు
మునగపాక: మహిళల రక్షణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి అన్నారు. మండలంలోని తిమ్మరాజుపేటలో డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో శనివారం రాష్ట్ర యువ మహిళల శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి.అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు పలు ప్రాంతాల నుంచి మహిళలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఐద్వా రమాదేవి మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయని చెప్పారు. మహిళలంతా సంఘటితంగా ఇటువంటి సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డావెన్సీ అంతర్జాతీయ పాఠశాల డైరెక్టర్ రమణాజీ, సదాశివరావు,రొంగలి రాము,ఎస్.బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.