
1 నుంచి చౌకధరల దుకాణాల్లోనే సరకుల పంపిణీ
తుమ్మపాల: ప్రభుత్వం అందించే నిత్యావసర సరకులను వచ్చే నెల 1 నుంచి చౌక ధరల దుకాణాల (రేషన్ డిపోల) ద్వారానే పంపిణీ చేయనున్నట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌వో) కె.వి.ఎల్.ఎన్.మూర్తి అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ సరకులు పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జిల్లాలో 1,069 చౌక ధరల దుకాణాల ద్వారా సరకుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపల కుటుంబంలోని ఎవరైనా వెళ్లి సరకులు పొందవచ్చన్నారు. చౌక ధరల దుకాణాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని, ఆ సమయంలో లబ్ధిదారులు సరకులు తీసుకోవాలన్నారు. 65 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు 5వ తేదీ వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల సమయంలో వారి ఇంటి వద్దకే సరకులు అందజేస్తామన్నారు. లబ్ధిదారులు రాష్ట్రంలో ఏ చౌకధరల దుకాణం నుంచైనా వారి సరకులు పొందవచ్చునన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు వంటి ఏడు అంశాలకు సంబంధించిన సేవల కోసం ఇప్పటివరకు 21 వేల దరఖాస్తులు అందాయని చెప్పారు.
పోస్టాఫీసుల్లో ఆధార్ సీడింగ్
అనకాపల్లి: తపాలశాఖ అనకాపల్లి డివిజన్ పరిధిలో ఆధార్ సీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎన్‌పీసీఐ లింకింగ్ లేని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) లబ్ధిదారులకు ఆధార్ సీడింగ్ ద్వారా కొత్త అకౌంట్లు తెరుస్తామని డివిజన్ తపాలశాఖ సూపరింటెండెంట్ చుక్క శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల లబ్ధి సులువుగా జమ అయ్యేందుకు దగ్గరలో ఉన్న తపాలాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు.