
మరణంలోనూ వీడని స్నేహబంధం
అచ్యుతాపురం రూరల్: వారిద్దరూ మిత్రులు. ఒకే ఊరిలో నివాసం. ఒకే ఊరిలో ఉద్యోగం. ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసి మెలిసి తిరుగుతారు. అందుకే కాబోలు.. మృత్యువులోనూ వారిది వీడని బంధమే. పెదపాడు గ్రామానికి చెందిన రాయి గణేష్ (25), జనపరెడ్డి సంజీవ్ (21) సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. వీరు తిమ్మరాజుపేట నుంచి పెదపాడు స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిరుపేద వ్యవసాయ కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు అచ్యుతాపురంలో వేర్వేరు ప్రైవేట్ కంపెనీల్లో విధులు నిర్వహిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవారని స్థానికులు చెప్పారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాలతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడు జనపరెడ్డి సంజీవ్ అక్క 5 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడగా, తండ్రి పాము కాటుకు గురవ్వడంతో ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమయ్యాడు. ఇక మృతుని తల్లి స్థానికంగా దినసరి కూలి పని చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్న సమయంలో అందివచ్చిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
పెదపాడు గ్రామంలో
అలముకున్న విషాదం

మరణంలోనూ వీడని స్నేహబంధం